🎉 టాలీవుడ్ దర్శక ధీరుడు.. డైరెక్టర్ రాజమౌళి బర్త్ డే నేడు 🎂
- Suresh D
- Oct 10, 2023
- 2 min read
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ఏమని చెప్పాలి? ఆయన సాధించిన ఘనతలు ఎన్ని అని చెప్పాలి ఒకటా... రెండా... ఒక్కో మెట్టు ఎక్కుతూ, తనతో పాటు తెలుగు చిత్రసీమను ఎక్కిస్తూ... జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకూ పేరు, గౌరవం తీసుకు వచ్చారు. ఇప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటాయి.

రాజమౌళి ప్రయాణం చూస్తే... కమర్షియల్ సినిమాకు కావాల్సిన గ్రాఫ్ వందకు వంద శాతం కనబడుతోంది. దర్శకుడిగా ఆయన ప్రయాణం ప్రారంభించిన తీరు చూస్తే... ఇవాళ ఈ స్థాయికి వస్తారని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. తండ్రి విజయేంద్ర ప్రసాద్, పెదనాన్న శివశక్తి దత్తా రచయితలు అయినప్పటికీ... మధ్యలో వాళ్ళ కుటుంబం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది. మొదట తండ్రి దగ్గర రచయితగా పని చేశారు. 'శాంతి నివాసం' సీరియల్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. 'స్టూడెంట్ నంబర్ 1'తో వెండితెరపై దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. 'సింహాద్రి', 'సై', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'యమదొంగ' సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్నారు. కమర్షియల్ సక్సెస్ మీద సక్సెస్ కొట్టారు.
దర్శకుడిగా రాజమౌళి ప్రయాణంలో 'మగధీర' ఓ మేలు మజిలీ. ఆయన కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే... ఆ సినిమాకు ముందు, తర్వాత అని చెప్పాలి. రామ్ చరణ్ రెండో సినిమా అది! అప్పటికి మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా 'చిరుత' మాత్రమే చేశారు. ఒక్క సినిమాతో నటుడిగా చరణ్ మీద ఎటువంటి ఇమేజ్ లేదు. కానీ, అతడిలో ఎంత ప్రతిభ ఉందనేది వెలికి తీయడమే కాదు... తనకు అవకాశం ఇస్తే ఎటువంటి సినిమా తీయగలను అనేది 'మగధీర'లో యుద్ధ సన్నివేశాలు, మరీ ముఖ్యంగా ఎడారిలో హార్స్ రైడింగ్ సీన్స్ ద్వారా రాజమౌళి చూపించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు.
'మగధీర' వంటి భారీ విజయం తర్వాత ఎవరైనా సరే మరో భారీ సినిమా తీయాలని చూస్తారు. రాజమౌళి మాత్రం హాస్య నటుడిగా ప్రేక్షకుల్ని నవ్వించిన సునీల్ హీరోగా 'మర్యాద రామన్న' తీసి... సక్సెస్ కొట్టారు. సైకిల్ మీద సునీల్, ఆయన వెనుక విలన్స్... ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎంత థ్రిల్ ఇచ్చింది! 'మర్యాద రామన్న' తర్వాత 'ఈగ'ను హీరో చేసి హిట్ అందుకున్నారు.
రాజమౌళి కెరీర్‌లో 'మగధీర' మేలు మజిలీ అయితే... 'బాహుబలి' మన భారతీయ సినిమాకు మేలుకొలుపు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునే ప్రతి ఒక్కరికీ రాజమౌళి సినిమా షాక్ ఇచ్చింది. తెలుగు సినిమా కూడా ఉందని చాటి చెప్పింది. అంతే కాదు... సౌత్ సినిమా అంటే తమిళ్ ఒక్కటే కాదని, తెలుగు కూడా ఉందని రాజమౌళి చెప్పారు. మణిరత్నం, శంకర్ తదితర తమిళ దర్శకుల సినిమాలు చూసిన మెచ్చుకున్న హిందీ ప్రేక్షకులు... రాజమౌళి తీసిన 'బాహుబలి' చూసి ఔరా అనుకున్నారు.
'బాహుబలి' భారీ విజయం సాధించడం మాత్రమే కాదు... భారతీయ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా రికార్డు ఇంకా 'బాహుబలి 2' పేరు మీద ఉంది. హిందీ హీరోలు, దర్శకులు ఆ రికార్డును బ్రేక్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాతో అయితే ఇండియాను దాటి ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో అడుగు పెట్టారు జక్కన్న.
జాతీయ పురస్కారం కాదు... తెలుగు సినిమా కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డును తీసుకొచ్చారు రాజమౌళి. తెలుగు పాట 'నాటు నాటు'కు ఉత్తమ గీతంగా ఆస్కార్ వచ్చిందంటే అది రాజమౌళి కృషి వల్ల. ఓటీటీలో 'ఆర్ఆర్ఆర్' విడుదలైన తర్వాత హాలీవుడ్ సినిమా ప్రముఖులు పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇప్పుడు రాజమౌళి అంటే భారతీయ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్! 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆయన చేయబోయే సినిమా మీద హాలీవుడ్ కూడా ఆసక్తిగా చూస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో మహేష్ బాబు హీరోగా గ్లోబ్ ట్రాంటింగ్ సినిమా అనేసరికి అది అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా పని కట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు. 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ కొట్టిన రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ కూడా హాలీవుడ్ మార్కెట్టే!
ఆస్కార్ రావడం, అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి పేరు రావడం ఒక్క రాత్రిలో జరగలేదు. దాని వెనుక కొన్నేళ్ల కృషి ఉంది. 'ఈగ' నుంచి హిందీ ఇండస్ట్రీలో తన సినిమాలను ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఉత్తరాది ప్రేక్షకులకు మన సినిమా అంటే ఏమిటో రుచి చూపిస్తూ వచ్చారు. 'బాహుబలి'ని జపాన్ తీసుకు వెళ్లారు. ఆ దేశంలో వార్ బేస్డ్ మూవీస్ వస్తుంటాయి. వాళ్ళకు ఆ సినిమా నచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి గురించి వాళ్ళకు తెలిసింది. దాంతో 'ఆర్ఆర్ఆర్' సినిమాను అక్కడ కూడా ప్రమోట్ చేశారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్, ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లారు. రాజమౌళి ప్రయాణం రాబోయే కాలంలో వచ్చే దర్శకులకు ఓ పాఠ్య పుస్తకం.
'ఆర్ఆర్ఆర్'లో డైలాగ్ ఉంది కదా... 'కుంభస్థలాన్ని కొడదాం పదా' అని! ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు, భారతీయ సినిమా అభిమానులు కూడా ఆ మాటే చెబుతూ ఉన్నారు రాజమౌళి... 'జక్కన్నా! హాలీవుడ్ కుంభస్థలాన్ని కొట్టడానికి పదా'' అని! తెలుగు సినిమా స్థాయి, భారతీయ సినిమా గౌరవం పెంచిన రాజమౌళికి 'ఏబీపీ దేశం', ప్రేక్షకులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు.🏆🌟