top of page

తెలంగాణ కొత్త స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్📢👥

తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddem Prasad Kumar) పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddem Prasad Kumar) పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయన వికారాబాద్ (Vikarabad) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. తొలుత దుద్దిళ్ల శ్రీధర్ బాబును స్పీకర్ గా నియమిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఆయన ఆ పదవి చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. మరోవైపు, ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో 10 మంది మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అసెంబ్లీ స్పీకర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పదవి అంటేనే అందరికీ చేదు అనుభవం గుర్తుకు వస్తుంది. ఎందుకంటే, ఇప్పటివరకూ ఈ పదవి చేపట్టిన ఏ ఎమ్మెల్యే కూడా తర్వాత ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. అందుకే ఆ పదవి చేపట్టేందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయరు. అవసరం అయితే, నామినేటెడ్ పదవులను తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ చరిత్రను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ తిరగరాశారు. 2018లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన స్పీకర్ పదవి చేపట్టారు. తాజాగా, 2023 ఎన్నికల్లోనూ బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో స్పీకర్ పదవికి ఉన్న ఆ పేరు తొలిగినట్లయింది. పోచారం గెలుపుతో ఇక స్పీకర్ పదవి చేపట్టేందుకు ఎవరూ వెనకాడరనే భావించాలి. కాగా, ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఉన్నారు.📢👥



 
 
bottom of page