ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు.. కొనసాగనున్న నిరసనలు..!😞
- Suresh D
- Feb 20, 2024
- 2 min read
ఐదు పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం చేసిన ప్రతిపాదనను.. రైతు సంఘాలు తిరస్కరించాయి. ఫలితంగా బుధవారం నుంచి నిరసనలు కొనసాగనున్నాయి.😞
రైతులు- కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు ఇప్పట్లో ముగింపు పడే సూచనలు కనిపించడం లేదు! తాజాగా.. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను.. రైతు సంఘాలు తిరస్కరించాయి. ఫలితంగా.. బుధవారం నుంచి నిరసనలు కొనసాగనున్నాయి. దిల్లీ సరిహద్దుకు వేలాది మంది రైతన్నలు మార్చ్ చేపట్టనున్నారు.
చర్చల్లో భాగంగా.. ఐదు పంటలను 5ఏళ్ల పాటు, పాత ఎంఎస్పీ (కనిస మద్దతు ధర)కి కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రులు రైతులకు చెప్పారు. రెండు రోజుల తర్వాత నిర్ణయం చెబుతామని రైతులు అన్నారు. ఇదే విషయంపై.. సోమవారం అర్ధరాత్రి, రైతు సంఘాల నేతలు కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు.
"కేంద్రం చేసిన ప్రతిపాదన.. ఆమోదయోగ్యంగా లేదు. దిల్లీవైపు మా మార్చ్ని కొనసాగిస్తాము. శాంతియుతంగా నిరసనలు చేపడతాము," అని పంజాబ్, హరియాణా మధ్యలో ఉన్న శంభు సరిహద్దు వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్లో.. రైతు నాయకుడు శర్వాన్ సింగ్ పంధేర్ తెలిపారు.
"ఆదివారం రాత్రి.. ప్రభుత్వం ఓ ప్రతిపాదన చేసింది. మేము దానిపై అధ్యయనం చేశాము. 2,3 పంటలకే కనీస మద్దతు ధరను అప్లై చేయడంలో సెన్స్ లేదు. ఇతర రైతులు ఏమైపోతారు?" అని మరో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ అన్నారు.
"పప్పు ధాన్యాలపైనే ఎంఎస్పీ హామీ ఇస్తే.. కేంద్రంపై అదనంగా రూ. 1.5 లక్షల కోట్ల భారం పడుతుందని మంత్రులు అన్నారు. కానీ.. అన్ని పంటలకు ఎంఎస్పీ ఇచ్చినా.. రూ. 1.75 లక్షల కోట్లే అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కేంద్రం.. పామ్ ఆయిల్ని దిగుమతి చేసుకునేందుకు రూ 1.75 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది. ఆ నూనె ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అదే డబ్బులతో రైతులకు సాయం చేస్తే.. మేము మంచి విధంగా ఆయిల్సీడ్స్ని పెంచుతాము," అని దల్లెవాల్ స్పష్టం చేశారు."కేంద్రం చేసిన ప్రతిపాదన.. రైతులకు సాయం చేయదు. మేము మొత్తం 23 పంటలకు ఎంఎస్పీ అడిగాము. అది 'కనీస మద్దతు ధర'. అది ఆదాయం కాదు. మేము బతకడానికి అది సాయం చేస్తుంది. చట్టబద్ధంగా హామీ ఇవ్వకపోతే.. రైతు నిరసనలు కొనసాగుతాయి. ప్రతిపాదనను మేము తిరస్కరిస్తున్నాము," అని రైతు నేత దల్లెవాల్ తెలిపారు.
కనీస మద్దతు ధరతో పాటు రుణ మాఫీ వంటి అంశాలను కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
200 యూనియన్ల మద్దతుతో.. ఫిబ్రవరి 15న.. దాదాపు లక్ష మంది రైతులు.. పంజాబ్, హరియాణా నుంచి నిరసనల కోసం దిల్లీ బయలుదేరారు. ప్రస్తుతం వారందరు వివిధ సరిహద్దుల్లో ఉన్నారు. రైతు నిరసనలను అడ్డుకునేందుకు అధికారులు తీవ్రస్థాయిలో చర్యలు చేపట్టడంతో.. దిల్లీలో గందరగోళం కనిపించింది. ప్రజలు అల్లాడిపోయారు. 1 కి.మీ దూరం ప్రయాణించేందుకు 1 గంట పట్టిందంటే.. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇప్పుడు.. బుధవారం నుంచి నిరసనలు కొనసాగిస్తామని శంబు సరిహద్దు వద్ద ఉన్న రైతు నేతలు తేల్చేశారు. అదే సమయంలో.. నోయిడా, గ్రేటర్ నోయిడా దగ్గర ఉన్న రైతులు కూడా బుధవారం నుంచి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. దిల్లీ ప్రజలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు!










































