ఇంకా ఎవరిని నమ్మాలి..
- Suresh D
- Mar 29, 2024
- 1 min read
రాజకీయాల్లో పార్టీల అధినేతలు స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా.. వాటి మంచి చెడులు చెప్పే ఆంతరంగిక నాయకులు అంటూ ఉండడం అవసరం. పెద్దా.. చిన్నా.. అన్ని పార్టీలకూ ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నా.. అసలు నిర్ణయాలు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు తీసుకుంటారని అంటారు. ఒక్కొక్కసారి ముగ్గురూ కలిసి కట్టుగా నిర్ణయాలు చర్చించి తీసుకుంటారు. ఇది ఒక నమ్మకం. వైసీపీలోనూ అంతే. సీఎం జగన్ తనకంటూ నలుగురు నమ్మకస్తులను ఏర్పాటు చేసుకున్నారు. తాను తీసుకునే నిర్ణయాలపై వారితో చర్చిస్తారు. తర్వాత వాటిని ఎవరితో ఒకరితో ప్రకటించేలా చేస్తారు. ఇది కూడా ఒక నమ్మకం. ఇక, ఇప్పుడు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పరిస్తితికి వస్తే.. ఆయన సంపూర్ణంగా నమ్మింది.. విశ్వాసం ఉంచింది.. తన కుమారుడు కేటీఆర్ పై కంటే కూడా.. కే. కేశవరావుపైనే. ఇది ముమ్మాటికీ వాస్తవం. గత ఏడాది ఎన్నికలకు ముందు కూడా ఈ విషయం ఆయన చెప్పారు. “అనేక విషయాలు నా పెద్దన్న కేశవరావుగారితో చెప్పాను. ఆయన అంగీకరించారు. అందుకే ఇప్పుడు మీకు చెబుతున్నా” అంటూ. అభ్యర్థుల విషయాన్ని ప్రకటించారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు.. కేశవరావు.. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్ర వాదిగా కూడా ముద్రవేసుకున్నారు. కానీ.. రాష్ట్రం వచ్చాక.. కేసీఆర్ చెంతకు చేరి.. తన ఎత్తులతో కేసీఆర్‌ను తనవైపు తిప్పుకొన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ను నమ్మిన వారు.. ఉద్యమాన్ని ఉర్రూత లూగించిన వారిని కూడా ఆయన కేసీఆర్‌కు దూరం చేశారు. తద్వారా.. తన పదవులకు ఎసరు రాకుండా.. తన హవా తగ్గకుండా చూసుకున్నారు. చివరకు ఇంత నమ్మిన కేకే.. హ్యాండిచ్చారు. ఇక, ఇప్పుడు కేసీఆర్ ఎవరిని నమ్మాలి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.











































