కాలేజీ విద్యార్ధికి రూ.46 కోట్ల ఐటీ నోటీసు..
- Suresh D
- Apr 1, 2024
- 1 min read
Updated: Apr 2, 2024
ఓ కాలేజీ విద్యార్ధికి రూ.46 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ అధికారులు నోటీసులు పంపడంతో యువకుడు షాకయ్యాడు. విస్తుగొలిపే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ దండోటియా (25) విద్యార్థి స్థానిక కాలేజీలో చదువుతున్నాడు. అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఈ మొత్తానికి ఐటీ, జీఎస్టీ చెల్లించాలని ఇటీవల నోటీసులు ఇచ్చారు. దీంతో లబోదిబోమన్న బాధిత యువకుడు.. ఐటీ అధికారులను సంప్రదించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. విచారణ జరిపిన అధికారులు అతడి పాన్ కార్డుపై ఓ కంపెనీ రిజిస్టర్ అయినట్లు గుర్తించారు.ఆ కంపెనీ 2021 నుంచి ముంబయి, ఢిల్లీ వేదికగా కార్యకలాపాలు సాగించిందని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు.. ఆ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, కంపెనీ గురించి తనకు తెలియదని తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘ఆ విద్యార్థి పాన్ కార్డును గుర్తుతెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి కంపెనీని రిజిస్టర్ చేశారు.. ఆ తర్వాతే అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది’ అని పోలీసులు వెల్లడించారు.











































