top of page

నేడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న కేసీఆర్

బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో కేసీఆర్‌ ప్రమాణం చేయనున్నారు.

బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత ఏడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి శాసన సభ్యుడిగా కేసీఆర్‌ గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు గాయం కావడంతో ఆపరేషన్‌ నిర్వహించారు. దాదాపు రెండు నెలలుగా విశ్రాంతికి పరిమితం అయ్యారు. దీంతో కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇటీవల కేసీఆర్ కాస్త కోలుకున్నారు. చేతికర్ర సాయంతో అడుగులు వేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి కేసీఆర్‌ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు శాసన సభాపతి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని బిఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసన సభ పక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. కేసీఆర్‌ ప్రమాణం సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండో రోజే కేసీఆర్‌ బాత్రూంలో జారి పడటంతో తుంటి ఎముక విరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కేసీఆర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో మెల్లగా నడవగలుగుతున్నారు.

ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానుండటంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ కార్యక్రమాలను యాక్టివేట్ చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు.

 
 
bottom of page