top of page

నంది అవార్డుల స్థానంలో గద్దర్ పురస్కారాలు- సీఎం రేవంత్ రెడ్డి🎥🏆

సినీ పురస్కారాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పురస్కారాలు అందిస్తామన్నారు.🎥🏆

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... నంది అవార్డులు పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరారని, అయితే నంది అవార్డుల స్థానంలో గద్దరన్న పేరుతో కళాకారులకు అవార్డులు అందిస్తామన్నారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డులు అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మొదలుపెట్టిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దర్ అన్నారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడితే, ఆ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ గద్దరన్న ఉద్యమించారన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలే మాకు స్ఫూర్తి అన్నారు.

ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి, ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటుకు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. గత ఎన్నికల్లో గద్దర్ కుమార్తెకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. కానీ ఆమె ఓటమిపాలైయ్యారు.

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు తెల్లాపూర్‌ మున్సిపాలిటీ ఓ తీర్మానాన్ని చేసింది. ఈ తీర్మానానికి హెచ్ఎండీఏ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించింది. అయితే విగ్రహ ఏర్పాటు కావాల్సిన స్థలం కేటాయింపు అనుమతులు రావడంతో కొంత జాప్యం జరిగింది. దీంతో ప్రజాసంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.🎥🏆

 
 
bottom of page