top of page

మరోసారి విరాట్ పరాక్రమం.. కివీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్ 🏏

2023 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 5వ విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 20 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో కివీస్‌పై భారత జట్టు విజయం సాధించింది. అంతకుముందు 2003లో సెంచూరియన్ మైదానంలో కివీస్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 🏆🇮🇳

ree

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పొయి.. ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (95) మరోసారి ఛేజింగ్‌లో కింగ్ అని నిరూపించుకున్నాడు. అయితే తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ (46), శ్రేయాస్ అయ్యర్ (33), రవీంద్ర జడేజా (35 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌కు వరుసగా ఐదో విజయం కాగా.. కివీస్‌కు తొలి ఓటమి.

కివీస్ విధించిన 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి మంచి ఆరంభాన్ని అందించారు. 11.1 ఓవర్లలో 71 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ (40 బంతుల్లో 46, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంతసేపు భారీ షాట్లతో అలరించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. గిల్ (31 బంతుల్లో 26) ఈసారి త్వరగా పెవిలియన్‌కు చేరిపోయాడు. దీంతో 76 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (29 బంతుల్లో 33) ఇన్నింగ్స్‌ను నిర్మించారు. 128 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ ఔట్ అవ్వగా.. కేఎల్ రాహుల్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు కోహ్లీ.

వీరిద్దరు నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. 182 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (27) ఔట్ అవ్వగా.. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (2) రనౌట్ అయ్యాడు. దీంతో కాస్త న్యూజిలాండ్ పట్టుసాధించినట్లు కనిపించింది. అయితే విరాట్‌కు జత కలిసిన రవీంద్ర జడేజా కివీస్‌ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. కోహ్లీకి చక్కటి సహకారం అందిస్తునే.. టీమిండియాను విజయం వైపు నడిపించాడు. భారత్ విజయానికి ఐదు పరుగులు అవసరం అవ్వగా.. కోహ్లీ సెంచరీకి కూడా 5 పరుగుల దూరంలోనే ఉన్నాడు. దీంతో కోహ్లీ మరోసారి శతకం పూర్తి చేస్తాడనిపించింది. అయితే భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. చివరి జడేజా బౌండరీతో విన్నింగ్ షాట్ ఆడాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఆరో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 2, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. డారిల్ 127 బంతుల్లో 130 పరుగులు (9 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. రచిన్ రవీంద్ర 87 బంతుల్లో 75 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత్ తరఫున మహ్మద్ షమీ 5 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. షమీకి మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.🏆🇮🇳


 
 
bottom of page