సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్న మనిషి మెదడులో అమర్చిన చిప్
- Shiva YT
- Mar 22, 2024
- 1 min read
మనిషి మెదడులో చిప్ అమర్చడం అనేది ఎలాన్ మస్క్ కల. ఆ కల నెరవేరడమే కాదు.. విజయవంతంగా పనిచేస్తోంది కూడా. న్యూరాలింక్ ఇటీవల మనిషి మెదడులో చిప్ అమర్చింది.
సదరు వ్యక్తి కోలుకుంటున్నాడని, తన ఆలోచనల ద్వారా కంప్యూటర్ మౌస్‌ను నియంత్రించగలుగుతున్నాడని స్టార్టప్ వ్యవస్థాపకుడు మస్క్ గతంలో వెల్లడించారు. తాజాగా న్యూరాలింక్ దీనిపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. చిప్‌ను అమర్చిన వ్యక్తి నోలాండ్ అర్బాగ్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. పక్షవాతంతో బాధపడుతున్న ఆయనతో వీడియో గేమ్ సివిలైజేషన్ VI, చెస్ ఆడించింది. దాన్ని ఎక్స్‌లో లైవ్ స్ట్రీమ్ చేసింది. ఎవరి సాయం లేకుండా ఆయన గేమ్ ఆడినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను న్యూరాలింక్ సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. లైవ్ స్ట్రీమ్ సమయంలో అర్బాగ్ స్పందిస్తూ… తన జీవితంలో ఇక చేయలేననుకున్న చాలా పనులు సొంతంగా చేసుకోగలుగుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఈ అధునాతన సాంకేతికతలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మరింత మెరుగుపరిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయని వివరించారు. జీవితంలో తాను గేమ్స్ ఆడతానని ఊహించలేదన్నారు.








































