టాటూ వేసుకుంటే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా.?
- MediaFx
- Jun 24, 2024
- 1 min read
టాటూ వేసుకోవడం ఇటీవల ఓ ట్రెండ్‌గా మారింది. మరీ ముఖ్యంగా యువత పిచ్చిపట్టినట్లుగా టాటూలు వేసుకుంటారు. చేతులు ముఖం కాళ్లు ఇలా ఎక్కడపడితే అక్కడ టాటులు వేసుకుంటున్నారు. అయితే టాటూలు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా.? దీనివల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా.? అన్ని దానిపై ఎప్పటి నుంచో చర్చ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాటు కు లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్‌కు మధ్య సంబంధం ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. స్వీడన్‌లోని లిండ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనం కోసం స్వీడిష్ నేషనల్ క్యాన్సర్ రిజిస్టర్‌ను విశ్లేషించారు. వారు 2007, 2017 మధ్య లింఫోమాతో బాధపడుతున్న 20 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల నుండి డేటాను పరిశీలించారు. దీని తరువాత, ఈ వ్యక్తులను లింఫోమా లేని అదే వయస్సు గల ఆరోగ్యకరమైన వ్యక్తుల సమూహంతో పోల్చారు. టాటూలు లేని వ్యక్తులతో పోలిస్తే, టాటూలు వేసుకున్న వారిలో లింఫోమా వచ్చే ప్రమాదం 21% ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. గత రెండేళ్లలో టాటూలు వేసుకున్న వారిలో లింఫోమా వచ్చే ప్రమాదం 81% ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. అయితే, టాటూ ఇంక్‌లోని ఏ రసాయనాలు లింఫోమా ప్రమాదాన్ని పెంచుతాయో అర్థం చేసుకోవడానికి మరింత అధ్యయనం అవసరమని పరిశోధకులు అంటున్నారు. అలాగే, ఈ అధ్యయనం టాటూలే నేరుగా క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని నిరూపించలేదు, కానీ రెండింటి మధ్య సంబంధం ఉండవచ్చని మాత్రమే సూచిస్తుంది. అయితే టాటూనే క్యాన్సర్ కారణమని పక్కాగా చెప్పేందుకు ఇంకా బలమైన ఆధారాలు లభించలేవని పరిశోధకులు చెబుతున్నారు. లింఫోమా అనేది అరుదైన క్యాన్సర్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే టాటూల విషయంలో జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. శుభ్రత పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ, నాణ్యమైన ఇంక్‌ని ఉపయోగించే ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్‌ల వద్ద మాత్రమే టాటూ వేయించుకోవాలి. తక్కువ ధరకు లభిస్తుందని ఎక్కడపడితే అక్కడ టాటూలు వేసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.