సాఫ్ట్‌వేర్ రంగం మారుతోంది.. ఇకపై వీరికే అధిక అవకాశాలు
- MediaFx
- May 25, 2024
- 1 min read
ఐటీ ఉద్యోగం చాలా మందికి ఒక డ్రీమ్. బీటెక్ కాగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం సాధించాలని చాలా మంది కోరుకుంటారు. ఒకవేళ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రాకపోయినా ఏదో ఒక కోర్స్ నేర్చుకొని అందులో ప్రావీణ్యం పొంది ఉద్యోగం పొందేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగాల్లోనూ మార్పులు వస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాలపై దృష్టిసారిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్ వార్తలు భయపెడుతోన్న వేళ, లెవెల్స్.ఎఫ్‌వైఐ అనే ప్లాట్ ఫామ్ కీలక విషయాలను వెల్లడించింది.
ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారింది. దాదాపు అన్ని సెక్టార్లలో కృత్రిమ మేధ వినియోగం పెరిగిపోయింది. దీంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కచ్చితంగా తమ స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒక కోర్స్‌తో సరిపెట్టుకుంటామనే రోజులు పోయాయి. కచ్చితంగా అప్‌డేట్ కావాల్సిందే. ప్రపంచ దిగ్గజ సంస్థలు.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటివి సైతం ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం ఉన్న ఇంజనీర్లనే తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
ఓవైపు ఉద్యోగాలు పోతున్నాయన్న భయల నడుమ ఈ టెక్నాలజీలో ప్రావీణ్యం ఉన్న వారికి అధిక వేతనాలు చెల్లిస్తున్నాయి. సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పోల్చితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన ఉన్న వారికి 50 శాతం అధిక వేతం చెల్లిస్తున్నాయని ‘లెవెల్స్.ఎఫ్‌వైఐ’ తన తాజా నివేదికలో పేర్కొంది. గత నెలాఖరు నాటికి అమెరికాలో ఏఐ స్కిల్స్ ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల వేతనం ఏటా సరాసరి మన కరెన్సీలో రూ.2,49,31,650గా ఉంది. సాధారణ ఐటీ ఉద్యోగులతో పోల్చితే వీరికి సుమారు లక్ష డాలర్లు అధికంగా చెల్లిస్తున్నారని నివేదికలో పేర్కొన్నార.
అయితే రెండేళ్ల క్రితం ఏఐ నిపుణులు, సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల మధ్య వేతనంలో వ్యత్యాసం 30 శాతం ఉంటే, ఇప్పుడది ఏకంగా 50 శాతానికి చేరుకున్నది. దీనిబట్టే రానున్న రోజుల్లో ఏఐ నిపుణులకు ఎలాంటి డిమాండ్ ఉండనుందో స్పష్టమవుతోంది. కాబట్టి రానున్న రోజుల్లో ఉద్యోగాలు కోల్పోకూడదన్నా, మరింత మెరుగైన జీతాలు పొందాలన్నా ఉద్యోగులు కచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.