top of page

పక్కాగా ఓట్ల బదిలీ జరిగేలా చూసుకోవాలన్న పవన్ కళ్యాణ్… రాజమండ్రి రూరల్‌లో పోటీ చేస్తామని ప్రకటన..

టీడీపీ TDP వరుస విజయాలు సాధిస్తున్న నియోజక వర్గాల్లో ఒకటైన రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో ఈసారి జనసేన పోటీ చేయాలనుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు. జనసేన టీడీపీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోయినా ఏ స్థానాల్లో జనసేన పోటీ చేయాలనుకుంటుందనే విషయంలో పవన్ క్లారిటీ ఇచ్చేస్తున్నారు. తాజాగా రాజమండ్రి రూరల్‌లో కందుల దుర్గేష్ పేరును ప్రకటించడంతో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య సీటుకు ఎసరు తెచ్చేలా ఉంది.

టీడీపీతో పొత్తు రాష్ట్రానికి చాలా అవసరమని, పొత్తులో భాగంగా జనసేనకు దక్కే స్థానాల్లో మిత్రపక్షాల ఓట్లు పక్కాగా దక్కించుకోవాలని పవన్ కళ్యాణ్‌ రాజమయండ్రిలో క్యాడర్‌కు సూచించారు. మిత్రపక్షం టీడీపీ పోటీ చేసిన చోట..జనసేన ఓటు బదిలీ అయ్యేలా చూసుకోవడం కూడా కీలకమన్నారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేనకు భారీగా ఓట్లు పడ్డాయని, రాజమండ్రి రూరల్ స్థానం నుంచి పోటీ చేస్తామని, అక్కడ నుంచి టీడీపీ వరుసగా గెలిచిందని చెబుతున్నందున రాజమండ్రి రూరల్ టీడీపీ నేతలతో మాట్లాడదామని చెప్పారు. రాజమండ్రి రూరల్ స్థానం ఆశిస్తున్న కందుల దుర్గేష్‌ను వదులుకోమని హామీ ఇచ్చారు.

కులాలను కలపడమే లక్ష్యం…

‘జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాల్లో ‘కులాలను కలిపే ఆలోచనా విధానం’ అనేది ఒకటని ఇది కోనసీమలో కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాన్ని కోనసీమ ప్రజలు, ముఖ్యంగా యువత పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారన్నారు.

కులాల మధ్య ఐక్యత తీసుకురావడం ఒక రోజులో అయ్యే పని కాదని ... ఐక్యత విలువను ఎప్పటికప్పుడు అందరికీ తెలియచెప్పాలన్నారు. 2018 నుంచి కోనసీమ ప్రాంతానికి వెళ్ళిన సందర్భాల్లో వివిధ సామాజిక వర్గాలతో మాట్లాడటం, ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులకు కులాల ఐక్యత సాధించడం గురించి మాట్లాడుతూ వచ్చానని వివరించారు.

కోనసీమలో కులాల మధ్య గొడవలు సృష్టించాలని వైసీపీ ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. కోనసీమ అల్లర్లు, తదనంతరం నమోదు చేసిన కేసుల గురించి వివరించారు.

“కులాల మధ్య సఖ్యత ద్వారా సామాజిక అభివృద్ధి సాధ్యం అవుతుంది. కోనసీమలో చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనల వెనక ఉన్న కుట్రను ప్రజలు అర్థం చేసుకున్నారు అంటే అందుకు కారణం – అన్ని వర్గాల ప్రజలు ఒక తాటి మీదకు రావడమేనన్నారు.

ఈ సఖ్యత తీసుకురావడం వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు, కృషిని అంతా గుర్తించాలన్నారు. ముఖ్యంగా యువతరం నాయకులు ముందుకు రావడం శుభ పరిణామం. ఈ సఖ్యత లోపించి ఉంటే.. కోనసీమలో వైసీపీ కుట్ర సఫలమై అదో రావణ కాష్టంలా మారేదని వివిధ సామాజిక వర్గాల నాయకులు బాధ్యతగా నిలబడ్డారు కాబట్టే కోనసీమలో చాలా త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు

రాజమండ్రిలోనే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పానని అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తూ... సోదర భావంతో ముందుకు వెళ్తే కచ్చితంగా అది గొప్ప సంకేతం అవుతుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా కులాల ఐక్యత ప్రభావం కనిపిస్తుందని పవన్ కళ్యాణ‌్ చెప్పారు.

 
 
bottom of page