మోదీ 3.0 పక్కా.. కానీ 400 సీట్లు రాకపోవచ్చు!🗳️🤔
- Suresh D
- Feb 9, 2024
- 2 min read
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. మోదీ.. మూడోసారి కూడా ప్రధాని అవుతారని, కానీ బీజేపీ పెట్టుకున్న 400 సీట్ల టార్గెట్ రీచ్ అవ్వకపోవచ్చని స్పష్టమైంది.
దేశంలో ఎన్నికల ఫీవర్ రోజురోజుకు పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీలన్నీ తమ ఆయుధాలతో సన్నద్ధమవుతున్నాయి. కాగా.. ఇప్పటికే వచ్చిన సర్వేలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ఈసారి కూడా గెలుస్తారని చెబుతున్నాయి. తాజాగా జరిగిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే కూడా ఇదే స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మోదీ 3.0 పక్కా అని వెల్లడించింది. సర్వేలోని పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. 335 సీట్లల్లో గెలుస్తుంది. అంటే.. కమలదళం పెట్టుకున్న 400 సీట్ల టార్గెట్ రీచ్ అవ్వకపోవచ్చు.
లోక్‌సభలో 545 సీట్లు ఉంటాయి. మెజారిటీ ఫిగర్ 272. అంటే.. ఆ మార్క్‌ని ఎన్డీఏ సులభంగా దాటేస్తుంది. కానీ.. 2019తో పోల్చుకుంటే ఈసారి అధికార కూటమికి సీట్లు తగ్గొచ్చు.
అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోని 35,801 మందిని ఇంటర్వ్యూ చేసి.. ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేని రూపొందించారు. 2023 డిసెంబర్ 15- 2024 జనవరి 28 మధ్యలో ఈ సర్వే జరిగింది.
మరోవైపు.. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి.. ఈ సారి నిరాశ తప్పదని సర్వే సూచిస్తోంది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమికి 166 సీట్లు వస్తాయని స్పష్టం చేస్తోంది.
పార్టీల వారీగా చూసుకుంటే.. 543 సీట్లల్లో బీజేపీకి 304 సీట్లు రావొచ్చని మూడ్ ఆఫ్ ది నేషన్ సూచిస్తోంది. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా మళ్లీ కమలదళమే అవతరించనుందని చెబుతోంది. 2019లో బీజేపీ 303 సీట్లు వచ్చాయి.
ఇక రెండో అతిపెద్ద పార్టీగా.. 71 సీట్లతో కాంగ్రెస్ నిలుస్తుందని సర్వే చెబుతోంది. ఇదే జరిగితే.. 2019తో పోల్చుకుంటే, ఈసారి ఆ పార్టీకి 19 సీట్లు పెరిగినట్టు అవుతుంది. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు మిగిలిన 168 సీట్లల్లో గెలుస్తారు!
లోక్‌సభ ఎన్నికలపై నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం.. దేశంలో మోదీ మేనియా తగ్గలేదు! అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంతో మోదీ ఫేమ్ మరింత పెరిగింది! సర్వేలో పాల్గొన్న 42శాతం మంది చెప్పింది ఇదే!
ప్రపంచంలో కొత్త శక్తిగా ఇండియా ఎదుగుతోందని, అందుకు మోదీ ప్రభుత్వమే కారణమని.. సర్వేలో పాల్గొన్న 19శాతం మంది అభిప్రాయపడ్డారు. మోదీ తీసుకున్న జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును 12శాతం మంది సమర్థించారు.
అంతేకాకుండా.. కొవిడ్ 19 సంక్షోభాన్ని మోదీ ప్రభుత్వం ఎదుర్కొన్న తీరును చూసిన ప్రజలకు.. ప్రధానిపై నమ్మకం మరింత పెరిగిందట! సర్వేలో పాల్గొన్న 20శాతం మంది చెప్పింది ఇదే. బీజేపీపై అవినీతి మచ్చ లేకుండా పాలన సాగిస్తోందని మరో 14శాతం మంది అభిప్రాయపడ్డారు.
అయితే.. నిరుద్యోగ సమస్య మాత్రం బీజేపీకి కాస్త సమస్యలను తెచ్చిపెట్టే విధంగా ఉంది! మోదీ పాలనలో అతి పెద్ద సమస్య ఇదేనని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో పాల్గొన్న 18శాతం మంది అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల కూడా ఇబ్బంది కలిగిస్తోందని 24శాతం మంది పేర్కొన్నారు. 13శాతం మంది మాత్రం.. కొవిడ్ సంక్షోభాన్ని నిర్వహించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
అవినీతిని మోదీ తగ్గించారా? అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్న వారు మిశ్రమంగా స్పందించారు. మోదీ పాలనలో అవినీతి తగ్గిందని 46శాతం మంది అంటే.. లేదు, తగ్గలేదు అని 47శాతం మంది అభిప్రాయపడ్డారు.🗳️🤔