టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతోన్న మలయాళం సినిమాలు🎥✨
- Suresh D
- Apr 17, 2024
- 1 min read
భాషాభేదాలతో సంబంధం లేకుండా మంచి సినిమా ఏ భాషలో వచ్చిన ఆదరించే గొప్ప మనసు తెలుగు ప్రేక్షకులది. గతంలో ఎన్నో సందర్భాల్లో ఇది రుజువు అయ్యింది. ఇప్పటికీ అవుతూనే ఉంది. కథ బాగుంటే స్ట్రెయిట్, డబ్బింగ్ అన్నది చూడకుండా... చిన్న హీరో...పెద్ద హీరో అనే పట్టింపులు లేకుండా ఆ సినిమాను హిట్ చేస్తుంటారు.అందుకే తమిళం, కన్నడం, మలయాళం, హిందీ హీరోలు తమ సినిమాలను తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ఆసక్తిని చూపుతుంటారు. స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా డబ్బింగ్ సినిమాలు వసూళ్లను రాబట్టిన దాఖలాలు టాలీవుడ్‌లో లెక్కకుమించి ఉన్నాయి.
ఇదివరకు టాలీవుడ్ బాక్సాఫీస్ తమిళ డబ్బింగ్ సినిమాల హవా కొనసాగేది. రజనీకాంత్, కమల్‌హాసన్, విక్రమ్, సూర్య తో పాటు ఇతర తమిళ హీరోల సినిమాలు భారీగా వసూళ్లను రాబట్టేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. కోలీవుడ్ మూవీస్‌ను మలయాళ సినిమాలు డామినేట్ చేస్తున్నాయి.టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మలయాళ డబ్బింగ్ బొమ్మలు అదరగొడుతోన్నాయి. గత ఏడాది రిలీజైన 2018 నుంచి ఇటీవల విడుదలైన మంజుమ్మేల్ బాయ్స్ వరకు పలు మలయాళ డబ్బింగ్ సినిమాలు నిర్మాతలు భారీగా లాభాలను తెచ్చిపెట్టాయి. ఇదివరకు మలయాళ డబ్బింగ్ సినిమాలను చిన్న నిర్మాతలు తెలుగులో రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు గీతా ఆర్డ్స్, సితార, మైత్రీ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. 🎥