ఇంగ్లండ్‍తో మూడో టెస్టులో పటిష్ఠ స్థితిలో భారత్.. అదరగొట్టిన యశస్వి, గిల్.. ఆధిక్యం ఎంతంటే..🏏✨
- Suresh D
- Feb 17, 2024
- 2 min read
ఇంగ్లండ్‍తో మూడో టెస్టులో టీమిండియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టగా.. గిల్ అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో భారీ ఆధిక్యం దిశగా భారత్ ముందుకు సాగుతోంది. ఆ వివరాలివే..🏏✨
ఆల్‍రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపిన టీమిండియా..ఇంగ్లండ్‍తో మూడో టెస్టులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మ్యాచ్ మూడో రోజైన నేడు (ఫిబ్రవరి 17) బౌలింగ్, బ్యాటింగ్‍లో సత్తాచాటిన భారత్.. పటిష్ఠ స్థితిలో నిలిచింది. రాజ్‍కోట్ వేదికగా ఇంగ్లండ్‍తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజును 2 వికెట్లకు 196 పరుగుల వద్ద భారత్ ముగించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం 322 పరుగులకు చేరింది.
టీమిండియా యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (104 పరుగులు; రిటైర్డ్ హర్ట్) సెంచరీతో కదం తొక్కగా.. శుభ్‍మన్ గిల్ (65 నాటౌట్) అజేయ అర్ధ శకతంతో నిలిచాడు. క్రీజులో గిల్‍తో పాటు కుల్‍దీప్ (3 నాటౌట్) ఉన్నాడు. దీంతో మూడో రోజు ముగిసే సరికి భారత్.. ఈ మూడో టెస్టులో బలమైన స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్‍కు భారీ టార్గెట్ ఇచ్చే దిశగా ముందుకు సాగుతోంది. రేపు నాలుగో రోజు బ్యాటింగ్‍ను గిల్, కుల్దీప్ కొనసాగించనున్నారు.
అంతకు ముందు.. 207 పరుగులకు 2 వికెట్ల వద్ద మూడో రోజు ఆటకు దిగిన ఇంగ్లండ్‍ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (153) శతకం చేయగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (41) కాసేపు నిలిచాడు. ఓ దశలో 2 వికెట్లకు 224 వద్ద ఉన్న ఇంగ్లిష్ జట్టు చివరి 8 వికెట్లను కేవలం 95 పరుగులకే కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లతో దుమ్మురేపగా.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల స్టార్ స్పిన్నర్ అశ్విన్ మూడో రోజు బరిలోకి దిగకపోయినా.. మిగిలిన టీమిండియా బౌలర్లు అదరగొట్టారు.
126 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‍కు దిగింది టీమిండియా. లంచ్ అయిన కాసేపటికే భారత్‍కు బ్యాటింగ్ వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ (19) రూట్ బౌలింగ్‍లో ఎల్‍బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్ అద్భుతంగా ఆడారు. వికెట్ కాపాడుకుంటూనే క్రమంగా పరుగులు రాబట్టారు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ తన మార్క్ దూకుడైన హిట్టింగ్‍తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
80 బంతుల్లో యశస్వి అర్ధ సెంచరీకి చేరుకున్నాడు. మరోవైపు గిల్ ఆచితూచి ఆడాడు. అయితే, జైస్వాల్ మాత్రం గేర్ మార్చి దూకుడు కంటిన్యూ చేశాడు. ఇంగ్లిష్ బౌలర్లందరినీ బాదేశాడు. 122 బంతుల్లోనే సెంచరీ యశస్వి జైస్వాల్ మార్క్ చేరాడు. తన ఏడో టెస్టులోనే మూడో టెస్టు శకతంతో అలరించాడు. అయితే, కాసేటికే ఇబ్బందిగా అనిపించడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‍కు వెళ్లాడు. గిల్ 98 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. యంగ్ ప్లేయర్ రజత్ పటిదార్ (0) 10 బంతులు ఆడి ఇంగ్లిష్ స్పిన్నర్ హార్ట్లీ బౌలింగ్‍లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కుల్‍దీప్.. గిల్ నిలకడగా ఆడి రోజును ముగించారు. నాలుగో రోజు గిల్, కుల్దీప్ టీమిండియా రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తారు. ఇప్పటి వరకు 322 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగు, ఐదు రోజుల్లో పిచ్ స్పిన్‍కు ఎక్కువగా సహకరించే అవకాశం ఉండటంతో టీమిండియాకు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి.🏏✨