అవసరం లేకుంటే బయటకు రావొద్దు..
- MediaFx

- Jun 26, 2024
- 1 min read
కెన్యాలో పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో భారత ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కెన్యాలో ఉన్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుంటే బయటకు రావొద్దని మంగళవారం జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది.
‘‘ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేకుంటే బయటకు రావొద్దు. నిరసనలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకండి’’ అని కెన్యాలోని భారత కాన్సులేట్ పేర్కొంది. అలాగే, భారతీయులు స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, అప్‌డేట్స్ కోసం భారత కాన్సులేట్ మిషన్ వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో కావాలని సూచించింది.
మంగళవారం కెన్యా పార్లమెంట్‌ను ముట్టడించేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఐదుగురు చనిపోగా, డజన్ల సంఖ్యలో గాయాలయ్యారు. ఈ ఆందోళనల మధ్య పన్నుల పెంపు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో నిరసనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.












































