షేక్ హసీనా విషయంలో భారత్ సరైన పనే చేసింది..
- MediaFx

- Aug 12, 2024
- 1 min read
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా (Sheikh Hasina) ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. ఈ కష్ట సమయంలో హసీనాకు భారత్ అండగా నిలిచి.. దేశంలో ఆశ్రయం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘షేక్ హసీనాకు సాయం చేయకపోయి ఉంటే అది భారతదేశానికి అవమానకరంగా ఉండేది. మన స్నేహితులతో మనం చెడుగా ప్రవర్తిస్తే ఎవరూ మన స్నేహితులుగా ఉండాలని కోరుకోరు. హసీనా జీకి భారతదేశ నాయకులందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. షేక్ హసీనా భారతదేశానికి స్నేహితురాలు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేందుకు ముందు ఒకటికి రెండు సార్లు ఎవరూ ఆలోచించరు. భారత ప్రభుత్వం కూడా ఈ కష్ట సమయంలో హసీనాకు అండగా నిలిచింది. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి భద్రత కల్పించింది. భారత ప్రభుత్వం చేసిన పనిని నేను ఒక భారతీయుడిగా అభినందిస్తున్నాను. హసీనా విషయంలో భారత్ సరైన పనే చేసింది’ అని థరూర్ వ్యాఖ్యానించారు.












































