ఎప్పటిలాగే ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చేసిన ముంబై
- Suresh D
- Mar 25, 2024
- 1 min read
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న ముంబై ఇండియన్స్.. మరోసారి సీజన్ ప్రారంభ మ్యాచులో నిరాశ పరిచింది. ముంబై చివరగా 2012లో తన తొలి మ్యాచులో సీఎస్కేను ఓడించింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా ముంబై సీజన్ ఆరంభ మ్యాచులో గెలవలేకపోయింది. తాజాగా 2024 సీజన్‌ను సైతం ఓటమితోనే ఆరంభించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (43), డివాల్డ్ బ్రేవిస్ (46) రాణించడంతో ముంబై విజయం దిశగా సాగింది. 14 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు విజయానికి ఇంకా 48 పరుగులు అవసరం. క్రీజులో తిలక్ వర్మ, బ్రెవిస్ ఉండటం.. టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా లాంటి హిట్టర్లు బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో ముంబై విజయం ఖాయమని అంతా భావించారు. ఈ దశలోనే గుజరాత్ టైటాన్స్ జట్టు బలంగా పుంజుకుంది. 15వ ఓవర్లో 5 పరుగులు, 16, 17, 18, 19 ఓవర్లలో వరుసగా 4, 3, 9, 8 పరుగలు చొప్పున మాత్రమే ఇచ్చింది. చివరి ఓవర్లో ముంబై విజయానికి 19 పరుగులు అవసరం అయ్యాయి. ఉమేశ్ యాదవ్ వేసిన ఆ ఓవర్‌లో తొలి బంతిని సిక్స్, రెండో బంతిని ఫోర్ కొట్టిన హార్దిక్ పాండ్యా.. ముంబై శిబిరంలో ఆశలు రేపాడు. కానీ ఆ తర్వాత బంతికే పాండ్యా ఔట్ కావడంతో ముంబై కథ ముగిసింది. చివరకు 20 ఓవర్లలో ఆ జట్టు 162 పరుగులు చేసి.. 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


Comments