జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో పగులుతున అద్దాలు అంతుచిక్కని అనుమానాలు..?
- Suresh D
- Apr 19, 2024
- 1 min read
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న షాపుల అద్దాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరికొన్ని దాడులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సుమారు 6 స్టోర్లకు సంబంధించిన అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు కూడా చేపట్టారు. తాజాగా.. బంజారాహిల్స్ పరిధిలో ఈ తరహాలోనే జరిగిన మరో రెండు ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం. 2లో ఉన్న ఇమ్రాన్ ఫ్లాజా బిల్డింగ్‌లోని ఫస్ట్ ఫ్లోర్‌లో జౌక్ పేరుతో రెస్టారెంట్ నడుస్తున్నది. ఈ నెల 2న సాయంత్రం 7గంటల సమయంలో రెస్టారెంట్‌కు సంబంధించిన అద్దాలు ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి. దీంతో రెస్టారెంట్‌లోని సిబ్బందితో పాటు కస్టమర్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
అద్దాల్లో ఏవైనా సమస్యలు రావడంతో పగిలిపోయి ఉండవచ్చని భావించారు. అయితే, తాజాగా.. ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎవరో ఉద్దేశపూర్వకంగానే అద్దాలు పగలగొడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలాఉండగా.. జౌక్ రెస్టారెంట్ నిర్వాహకులు మీర్ మొహియుద్దీన్ అలీఖాన్ గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 308 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని జ్యోతి వెలెన్సియా బిల్డింగ్‌లోని గ్యాప్ స్టోర్‌కు చెందిన అద్దాలు పగిలిపోయినట్లు గురువారం స్టోర్ మేనేజర్ భిక్షపతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత నెలరోజులుగా జరుగుతున్న వరుస ఘటనలపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. దర్యాప్తులో భాగంగా అద్దాలు ధ్వంసమైన షాపులతో పాటు పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
పక్కా ప్లాన్‌తోనే కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి.. రోడ్లపై కనబడే స్టోర్లకు సంబంధించిన అద్దాలు పగలగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అద్దాలు పగలగొట్టడానికి రాళ్లు విసరడంలేదని, ఒక్కసారిగా అద్దాలు పగలడాన్ని చూస్తుంటే.. రాళ్లకు బదులుగా ఎయిర్ గన్ లాంటి ఆయుధంతో దాడులకు తెగపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నెల రోజుల నుంచి బంజారాహిల్స్ పరిధిలో ఇలాంటి దాడులు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులొస్తున్నాయి.