top of page

అసెంబ్లీలో వారందరినీ నిలబెట్టిన చంద్రబాబు..


విపక్ష నేతలపైనా అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిని సభలోని సభ్యులు అందరికీ తెలియజేసేలా చంద్రబాబు చేసిన పని.. సభలో నవ్వులు పూయించింది. కేసులు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఒక్కసారి సీట్లలో నుంచి లేచి నిల్చోవాలంటూ చంద్రబాబు సూచించారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా మెజారిటీ ఎమ్మెల్యేలు లేచి నిల్చున్నారు. దీంతో సభలో సభ్యులు అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. వైసీపీ విధానాలపై రాజకీయంగా పోరాడిన అందరి మీద అప్పటి వైసీపీ ప్రభుత్వం పోలీసుల సాయంతో కేసులు పెట్టించిందని చంద్రబాబు విమర్శించారు. ఎప్పటికీ బయటకు రానివ్వకూడదని అనుకున్నారని.. కానీ జనమే ఓట్లేసి అసెంబ్లీకి పంపారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే వైసీపీ పాలనలో తనపై 17 కేసులు పెట్టారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో బాబ్లీ కేసు తప్ప తనపై మరో కేసు లేదని.. కానీ వైసీపీ హయాంలో తనపై 17 కేసులు నమోదైనట్లు చంద్రబాబు చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ మీద ఏడు కేసులు పెట్టారన్న చంద్రబాబు.. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఏకంగా 60 కేసులు పెట్టారని గుర్తు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపైనా అధిక సంఖ్యలో కేసులు నమోదైనట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్న చంద్రబాబు.. పోలీసులను ఆయుధంగా చేసుకుని రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.




 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page