top of page

కెప్టెన్ మిల్లర్ రివ్యూ: ధనుష్, సందీప్ కిషన్‌ల వయొలెంట్ సినిమా ఎలా ఉంది?🎥🎞️

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా వయొలెంట్ డైరెక్టర్ అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌లు కూడా ఇందులో కీలక పాత్రలో నటించారు. సంక్రాంతికి తమిళంలో విడుదల అయిన ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమాను డబ్ చేశారు. ట్రైలర్ చూస్తే మంచి యాక్షన్ థ్రిల్లర్ అనే అంచనాలను ‘కెప్టెన్ మిల్లర్’ ఆడియన్స్‌కు అందించింది. మరి సినిమా ఎలా ఉంది?🎥🎞️

ree

తమిళనాట దర్శకుడు అరుణ్ మతీశ్వరన్‌కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. డెప్త్ ఉన్న కథలను బీభత్సమైన వయొలెన్స్‌తో మిక్స్ చేసి హార్డ్ హిట్టింగ్‌గా చెప్పడం అరుణ్ స్పెషాలిటీ. ‘కెప్టెన్ మిల్లర్’ కూడా ఎన్నో లేయర్స్ ఉన్న కథ. సినిమా ఫస్టాఫ్ అంతా అగ్నీశ్వర లైఫ్‌ను చూపించడంలోనే సరిపోతుంది. ఇంటర్వెల్‌కు కానీ అసలు కథ ప్రారంభం కాదు. ముఖ్యంగా పాత్రల పరిచయానికి అరుణ్ ఎక్కువ సమయం తీసుకున్నాడు. సినిమాలో ఉండే పాత్రలన్నిటి తీరుతెన్నులూ ఫస్టాఫ్‌లోనే అర్థం అయిపోతాయి. ఇది ఒక రకంగా మంచిదే అయినా కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది.

కొన్ని సన్నివేశాల్లో మాటలు చాలా బలంగా రాశారు. అగ్నీశ్వర ఆర్మీలో చేరాలని నిశ్చయించుకున్నాక శివన్నకు, అతనికి మధ్య జరిగే సంభాషణలు బాగా హార్డ్ హిట్టింగ్‌గా అనిపిస్తాయి. అలాగే ఆర్మీలో చేరాక సందీప్ కిషన్, ధనుష్, అబ్దూల్ లీల మధ్య సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ధనుష్ ఆర్మీ నుంచి పారిపోయాక ఇంటర్వల్ వరకు కథ సో సోగానే సాగుతుంది. విగ్రహం దొంగతనం జరిగిన దగ్గర నుంచి సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోతుంది. యాక్షన్ సీన్లు కూడా అద్భుతంగా తెరకెక్కించారు. వయొలెన్స్ మాత్రం అరుణ్ మతీశ్వరన్ గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువగా చూపించారు. యూ/ఏ సర్టిఫికెట్ కోసం కట్ చేశారేమో మరి!

ఇంటర్వల్ సమయానికి వచ్చే విగ్రహం దొంగతనం సీన్, ధనుష్ తన గ్రామానికి మొదటి సారి వచ్చినప్పుడు సాగే భారీ యాక్షన్ సీన్, క్టైమ్యాక్స్‌లో గ్రాండియర్‌గా సాగే ఫైట్ సీక్వెన్స్‌లు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ప్రీ-ఇంటర్వల్ దగ్గర నుంచి యాక్షన్ లవర్స్‌కు ఫీస్ట్ అని చెప్పవచ్చు. ట్రైలర్‌లో చూపించిన బ్రిటిష్ సైనికులను కర్రలకు కట్టేసి పేల్చేసే సీన్... స్క్రీన్‌పై మరింత ఎఫెక్టివ్‌గా కనిపిస్తుంది. అది సినిమాలో ఉన్న హైలెట్స్‌లో ఒకటి. 

‘కెప్టెన్ మిల్లర్’ అనేది కేవలం వయొలెన్స్‌తో కూడిన స్టోరీ మాత్రమే కాదు. స్వాతంత్ర్యం అంటే ఏంటి అనే దానికి అరుణ్ ఒక అందమైన నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఇప్పుడు బ్రిటీషోళ్ల కింద బతుకుతున్నాం. వాళ్లు వెళ్లిపోతే ఇక్కడి రాజుల కింద బతుకుతాం. వీళ్ల కంటే తెల్లోళ్లే నయం. ఇక్కడ ఉంటే మనల్ని చెప్పులు కూడా వేసుకోనివ్వరు. అదే బ్రిటిష్ సైన్యంలో చేరితే బూట్లు ఇస్తారు. ఇక్కడ మనల్ని గుళ్లోకి రానివ్వరు. అక్కడ వాళ్లు పక్కన కూర్చోపెట్టుకుని మంచి భోజనం పెడతారు. దేన్ని స్వాతంత్ర్యం అనాలి?’ అని ధనుష్ వేసే ప్రశ్న శివరాజ్ కుమార్‌ను కాదు సమాజాన్ని అడుగుతున్నట్లు ఉంటుంది.

టెక్నికల్‌గా కూడా ‘కెప్టెన్ మిల్లర్’ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. 1930ల నాటి పరిస్థితులను చాలా ఆథెంటిక్‌గా తెరపై చూపించారు. దీనికి ఫుల్ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ సిద్థార్థ్ నూనికి ఇవ్వవచ్చు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం టాప్ క్లాస్. యాక్షన్ సీన్లని నెక్స్ట్ లెవల్‌కి ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. టీజీ త్యాగరాజన్ ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. ఇంటెన్స్‌తో కూడిన వయొలెంట్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ‘కెప్టెన్ మిల్లర్’ మస్ట్ వాచ్ అని చెప్పవచ్చు. ఫస్టాఫ్ కాస్త నిడివి చూసుకుని ఉంటే సినిమా స్థాయి మరో లెవల్‌లో ఉండేది.

 
 
bottom of page