బిగ్‌బాస్ విజేతగా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్🎬🕺
- Suresh D
- Dec 18, 2023
- 1 min read
రిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభంలో బియ్యపు మూటతో హౌజ్‌లోకి వచ్చినప్పుడు కూడా 'ఇలాంటి వాళ్లని చాలామందిని చూశాం.. హౌజ్‌లో ఎన్ని రోజులుంటాడో చూద్దాం' అని అనుకున్న వాళ్లే ఎక్కువ. అయితే వాళ్లందరి అంచనాలు, అభిప్రాయాలు తప్పని నిరూపించడానికి ఎంతో సమయం పట్టలేదు.
ఒక సామాన్యుడు.. అసామాన్యుడు కావడమంటే మాటలు కాదు. కానీ, రైతు బిడ్డగా ఎలాంటి ఫాలోయింగ్ లేకుండా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. చివరికి ‘బిగ్ బాస్’ విన్నర్‌గా బయటకు వచ్చాడు. ఎప్పటికైనా ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లడమే తన లక్ష్యమని ఎన్నోసార్లు పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా వేదికలపై చెప్పాడు. చాలామంది అతడిని హేళన కూడా చేశారు. కానీ, ప్రశాంత్ అవేవీ పట్టించుకోలేదు. చివరికి ‘బిగ్ బాస్’ హౌస్‌లో అడుగుపెట్టాడు. తన కలను నెరవేర్చుకున్నాడు.
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అడుగుపెట్టడం అంటే మాటలు కాదు. ఇందుకు నిర్వాహకులు ఎన్నో ఆలోచిస్తారు. ఆ కంటెస్టెంట్ షోకు ప్లస్ అవుతాడు అనుకుంటేనే అవకాశం ఇస్తారు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ వాళ్లను మెప్పించి హౌస్‌లోకి వచ్చాడు. అయితే, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. నిలదొక్కుకోవడం కోవడం పెద్ద టాస్కే. ఆ విషయంలో పల్లవి ప్రశాంత్ ఏం చేస్తాడా అని అంతా అనుకున్నారు. మొదట్లో రతికాతో లవ్ ట్రాక్ వల్ల విమర్శలు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత ఆమెకు దూరంగా ఉంటూ తన ఆట తీరు మెరుగుపరుచుకున్నాడు. ప్రతి టాస్కును ప్రాణం పెట్టి ఆడేవాడు. బలమైన గాయాలైనా ఏ రోజు వెనక్కి తగ్గలేదు. మరో వైపు శివాజీ రూపంలో ప్రశాంత్‌కు ఒక గురువు దొరికాడు. ఆయన కనుసన్నల్లో తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడు. హౌస్‌లో అందరి మనసు గెలుచుకున్నాడు. అమర్‌తో విభేదాలు వచ్చినా.. అవి కేవలం నామినేషన్స్ వరకే. అతడితో కూడా ఎంతో స్నేహంగా మెలుగుతూ మెప్పించాడు. రైతుబిడ్డగానే కాకుండా కంటెస్టెంట్‌గా కూడా తానేంటో అనేది నిరూపించుకున్నాడు. 🎬🕺












































