top of page

అలాగైతే ఏపీలో అధికారం వారిదే?

ree

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ ఎక్కడా రీపోలింగ్ జరిగే అవకాశం లేదని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. అభ్యర్థుల జాతకాలు ఈవీఎంల్లో భద్రంగా ఉన్నాయి. జూన్ నాలుగో తేదీన ఎవరి జాతకం ఎలా ఉందో తెలిసిపోతుంది. అప్పటివరకు ప్రధాన పార్టీల తరఫున పోటీచేసిన అభ్యర్థులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండటమే. ఈ సారి కచ్చితంగా అధికారం దక్కుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. పెరిగిన పోలింగ్ శాతం కలిసివస్తుందని, 2019 ఎన్నికలకన్నా రెండు శాతం అదనగా పెరిగిందని, ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని టీడీపీ భావన. 

పోటెత్తిన ఓటర్లు 

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారని, జనసేనతో పొత్తు తమకు బాగా కలిసి వస్తుందని, ఓట్ల శాతం పెరుగుతుందని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది. మేనిఫెస్టో ప్రభావం కూడా గట్టిగానే ఉంటుందని, గత ఎన్నికల్లో వైసీపీ అమ్మఒడి ప్రకటించడంతో ఓటర్లు అటువైపు మొగ్గారని, ఈసారి తాము ప్రకటించిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.4వేల పింఛను, ఉచిత గ్యాస్ సిలిండర్ల లాంటివి మహిళలను ఆకట్టుకున్నాయనే నమ్మకంతో టీడీపీ ఉంది. 

అభివృద్ధి వైపే మొగ్గు 

వైసీపీకి మించిన పథకాలను సూపర్ సిక్స్ రూపంలో ప్రకటించడంతో గ్రామీణ ఓటర్లు కూడా కూటమివైపే మొగ్గారని టీడీపీ చెబుతోంది. తమకు ఒంటరిగానే 120 స్థానాలు వస్తాయని, కూటమి 140 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఏపీలో అధికారం మారబోతోందని టీడీపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. రాష్ట్రం బయట ఉన్న ఓటర్లంతా తమకు రాజధాని లేదు.. రాష్ట్రం అభివృద్ధి చెందడంలేదు అనే కసితో ఎంతో దూరం నుంచి ఓపికగా వచ్చి ఓటు వేశారని, అవన్నీ కూటమికే పడ్డాయని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేవారివైపే ఓటర్లంతా మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోందని చెబుతున్నారు. 


 
 
bottom of page