top of page
MediaFx logos_edited.png

తెలంగాణలో తెలుగు భాషోద్యమం (సురవరం ప్రతాపరెడ్డి గారి 130వ జయంతి సందర్భంగా). — ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

May 27
2 min read

కవిగా, కథాశిల్పిగా, పత్రికా సంపాదకులుగా, చరిత్రకారుడుగా, సాంఘిక చరిత్రల నిర్మాణానికి మార్గదర్శనం చేసిన దార్శనికునిగా, పరిశోధకునిగా, గ్రంథాలయాల స్థాపకుడుగా, సంఘసంస్కర్తగా, హరిజన విద్యాలయాల స్థాపకుడుగా, అన్నింటిని మించి ప్రజాహిత చింతకుడుగా, అస్మితాత్మక తెలంగాణ చైతన్య రథ సారథిగా ప్రఖ్యాతిగాంచిన మహామనీషి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి.


ఆయన 1896 మే 28వ తేదీన జన్మించారు. కర్నూల్, హైదరాబాద్, మద్రాసులలో చదువుకున్నారు. 1922లో బి.ఎల్. పూర్తి చేశారు. అయితే న్యాయవాద వృత్తిలో స్థిరపడలేదు. ఆ వృత్తిలో ప్రవేశించడం వల్ల కలిగే అవరోధాలు, అంటే ముఖ్యంగా ప్రజాహిత కార్యాలకు సమయం చిక్కదని వారు భావించారు. అలాగని ఖాళీగా ఉన్నారా అంటే అనేక రంగాలను కళకళలాడించారు.


నిజాం ప్రభువుల పాలనలో భాషా, సాంస్కృతిక, ధార్మిక వికాసానికి కలుగుతున్న అవరోధాలను వారు గుర్తించగలిగారు. అందుకే రచనల ద్వారా, సమావేశాల ద్వారా, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా, కవి సమ్మేళనాల ద్వారా, పత్రికల ద్వారా జన జీవితంలో చైతన్యం నిర్మాణం చేయడానికే వారు తమ జీవితాన్ని అర్పించారు. పాఠశాలలు, గ్రంథాలయాలు స్థాపించి వాటి వికాసానికి విశేషంగా శ్రమించారు.


హైదరాబాదు సంస్థానంలో (నైజాంలో) తెలుగు భాష నిలదొక్కుకోవాలి; జనజీవనంలో వారి మాతృభాషపై మమకారం పెంచాలి. తెలుగు మాట్లాడేవారికి వారి భాషలోనే సమాజ - ప్రాంత - దేశ సమాచారం అందాలి. సమాజంలో దురాచారాలు దూరం కావాలి; సదాచారాలు ఆచరింపబడాలి. మహిళల్లో విద్యావ్యాప్తి జరగాలి, అన్యాయాన్ని - అధర్మాన్ని ఎదిరించే యువత నిర్మాణం కావాలి. పత్రికా మాధ్యమంగా ఈ ఆలోచనలు జన జీవితంలోకి వెళ్లాలి.


ఎన్నాళ్లుగానో వారిలో ఉన్న ఈ ఆలోచనలకు తోడైనవారు కోత్వాల్ రాజాబహద్దూర్ వెంకటరామరెడ్డి. అందువల్లనే 1926 మే 10వ తేదీన 'గోలకొండ' పత్రిక సురవరం వారి నేతృత్వంలో ప్రారంభమయింది. మొదట వారానికి రెండు సార్లు వెలువడే అర్ధవార పత్రికగా వెలువడింది. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు దినపత్రికగా మారింది. సంపాదకుల పేరు ఎవరికున్నా పత్రిక భారమంతా మోసింది ప్రతాపరెడ్డిగారే!


తమ పత్రికలోనే కాకుండా ఇతర పత్రికలలోనూ వారు వ్యాసాలు వ్రాశారు. భావకవి, రామమూర్తి, గద్యాల శర్మ, వెర్రి వెంగళప్ప, యుగపతి, చిత్రగుప్త, గ్రామసింహం, శ్రీశకుమార్ వంటి కలం పేర్లతో తొమ్మిది వందల వ్యాసాలు వ్రాశారు. మొత్తం రెండు వేల వ్యాసాలు వారు వ్రాశారంటే, ఎన్ని విభిన్న సామాజిక విషయాలను వారు స్వీకరించారో అర్థం చేసుకోవచ్చు. కేవలం వ్యాసాలే గాక వారు 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' వంటి అపూర్వ గ్రంథాలు రచించారు. ఈ సందర్భంగా వారు ఇలా అన్నారు.


"రాజుల రాజ్యాల చరిత్ర వ్రాయుట అంత కష్టము కాదు. కాని సాంఘిక చరిత్ర వ్రాయుట కష్టము. దీనికి ఆధారములు తక్కువ. తెలుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫియ్యతులు), విదేశీ జనులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్రములు, నాణెములు, సామెతలు, ఇతర వాఙ్మయములలోని సూచనలు, జానపదములు, సుద్దులు, జంగముల కథలు, పాటలు, చాటువులు, పూర్వ వస్తు సంచయములు (కలక్షన్స్) ఇవి సాంఘిక చరిత్రకు పనికి వచ్చు సాధనములు..."

ఇంత లోతుగా అధ్యయనం - పరిశీలన చేసి వ్రాసిన ఈ గ్రంథానికి 'కేంద్ర సాహిత్య అకాడమీ' పురస్కారం లభించింది. తెలుగులో ఈ అకాడమీ పురస్కారం పొందిన మొదటి గ్రంథం ఇదే.

నైజంలో తెలుగు కవులే లేరు (శూన్యం) అని ఎవరో అన్న కారణంగా, "ఇంతమంది ఉన్నారు చూడండి" అని అప్పటికప్పుడు ఉన్న కవులతో రచనలు చేయించి, 354 మంది కవుల రచనలు, 183 మంది పూర్వ కవులను పరిచయం చేస్తూ మొత్తం 537 మంది ఉన్నారని తెలియజేస్తూ 1934 లో 'గోలకొండ కవుల సంచిక' వెలువరించారు. ఇది వారి కీర్తి పతాకగా నిలిచింది. తెలంగాణ కవితా వైభవానికి దిక్సూచిగా పనిచేసింది.


హైందవ ధర్మవీరులు' పేరిట గ్రంథాన్ని ప్రచురించి, యువకులలో స్వాతంత్ర్య పిపాస కలిగించారు. 'మొగలాయి కథలు' పేరిట రెండు సంపుటాలు వెలువరించి, నిజాం కాలంలోని సామాజిక జీవనానికి దర్పణం పట్టారు. 1946 లో 'ఆంధ్ర లిపి సంస్కరణము' అనే గ్రంథాన్ని ప్రచురించి లిపి పరిశోధకులుగా నిలిచి కీర్తిపొందారు.

సంఘసంస్కరణము, మద్యపాన నిషేధము, గ్రామీణ సద్గ్రంథాలయము, హిందువుల పండుగలు, భక్త తుకారాం, నిజాం రాష్ట్ర పాలనము, గ్రంథాలయోద్యమము, రామాయణ విశేషములు, యువజన విజ్ఞానము, రాజాబహద్దూర్ వెంకట్రామరెడ్డి జీవితచరిత్ర... వంటి ముప్పయికి పైచిలుకు గ్రంథాలు ప్రచురించి యువ రచయితలకు మార్గదర్శకులుగా నిలిచారు.

మహిళా విద్యా వికాసం కొరకు పాఠశాలలు స్థాపించారు, వసతి గృహ సౌకర్యాలు కలిగించారు. కుల సంఘాల మధ్య సమరసతా वాతావరణాన్ని నిర్మాణం చేయడానికి విశేషంగా కృషి చేశారు. మద్యపానం వల్ల కలిగే నష్టాలను చెబుతూ వారు వ్రాసిన ఈ క్రింది పద్యం బహుళ ప్రచారంలో ఉంది:

ధనము వ్యయమై పోవును మనమున చురుకుందనమును మానును, యశమున్ అనిశము దినదినమును క్షీణించును తనువు చెడిపోవు కల్లు ద్రావుట చేతన్!

ఇటువంటి ప్రజాహిత చింతకులు అయినందువల్లనే వారి జీవితాన్ని ఆధారంగా చేసుకొని రకరకాల రచయితలు, వారి ఆదర్శాలు తెలియజేస్తూ మూడు పుస్తకాలు రచించారు. అవును, యువత అవి చదవాలి. వారూ ప్రజాహిత చింతకులు కావాలి.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
MediaFx logos_edited.png
bottom of page