top of page

రద్దైన యూజీసీ-నెట్ ఎగ్జామ్‌కు కొత్త షెడ్యూల్ ప్రకటన

ree

అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ రద్దు చేసిన యూజీసీ-నెట్ ఎగ్జామ్‌కు కొత్త షెడ్యూల్ వెలువడింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4, 2024 మధ్య పరీక్షను నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం పొద్దుపోయాక ప్రకటన విడుదల చేసింది. ఇక ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (AIAPGET) 2024 షెడ్యూల్ ప్రకారం జులై 6న నిర్వహించనున్నట్టు ధృవీకరించింది. మరోవైపు సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష జులై 25-27 మధ్య జరగనుంది. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల్లో లెక్చర్‌షిప్‌లు, రీసెర్చ్ ఫెలోషిప్‌లు కోరుకునే అభ్యర్థులకు నెట్, సీఎస్ఐఆర్ పరీక్షలు చాలా కీలకమైనవి. కాగా ఇప్పటివరకు పెన్ను, పేపర్ విధానంలో జరిగిన యూజీసీ-నెట్ ఎగ్జామ్‌ను ఇకపై కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. కాగా జూనియర్ రీసెర్చ్ ఫెలోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీహెచ్‌డీ స్కాలర్‌ల ఎంపిక కోసం జూన్ 18న దేశవ్యాప్తంగా రెండు విడతలుగా యూజీసీ-నెట్ ఎగ్జామ్ జరిగింది. అయితే అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడ్డాయి. విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. పరీక్ష సమగ్రత దెబ్బతినడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరీక్ష జరిగిన మరుసటి రోజే రద్దు చేసింది.

 
 
bottom of page