🚧 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి.. భూముల ధరలకు రెక్కలు! 🌆
- Jawahar Badepally
- Sep 19, 2024
- 1 min read

హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. రేవంత్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ) అభివృద్ధికి పూనుకోవడంతో, నగర విస్తరణ దిశగా ఈ రహదారి ముఖ్యమైన పాత్ర పోషించనుంది. ఈ రహదారి 21 గ్రామాల మీదుగా 40 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్లుగా అభివృద్ధి చేయబడనుంది.

హైదరాబాద్ విశ్వనగరంగా మారుతూ, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. నగరాభివృద్ధిపై మరింత దృష్టి సారించిన రేవంత్ రెడ్డి సర్కారు, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడింటితో పాటు ఇప్పుడు ఫోర్త్ సిటీ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి ప్రాజెక్టులతో పాటు, ప్రముఖ సంస్థలు, పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టనున్నారు.

ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుండి శ్రీశైలం నేషనల్ హైవే వరకూ 40 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్‌లోని ఎగ్జిట్ 13 రావిర్యాల నుండి మీర్ ఖాన్ పేట వరకు రహదారి నిర్మించబడుతుంది. భవిష్యత్తులో మీర్ ఖాన్ పేట నుండి రీజనల్ రింగ్ రోడ్ (RRR) వరకూ ఈ రహదారి విస్తరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ రహదారి గుండా వెళ్లే గ్రామాలు: నారేపల్లి, హఫీజ్‌పూర్, మజీద్‌పూర్, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ, కొంగర ఖుర్ద్, రాచలూర్, తిమ్మాయిపల్లి, గుమ్మడవెల్లి, మీర్‌ఖాన్‌పేట తదితర గ్రామాలు.

ఈ రహదారి నిర్మాణంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంస్థల రావడం, రోడ్డు విస్తరణతో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ భూమి ధరలు ఎకరానికి రూ.2 కోట్ల నుండి రూ.3 కోట్లు పలుకుతుండగా, రహదారి పూర్తయిన తర్వాత ఈ ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.