🗳️ఎగ్జిట్ పోల్స్ డిబేట్లకు దూరంగా ఉండనున్న కాంగ్రెస్ బీజేపీ విమర్శలు! 🔥
- MediaFx

- Jun 1, 2024
- 1 min read
ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ మరో విమర్శనాస్త్రంగా మలుచుకుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ప్రకటనపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆ పార్టీ ప్రధాన వ్యూహకర్త, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. భారీ ఓటమి ఎదురవ్వబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి తెలుసునని అన్నారు. ‘‘మీడియా, ప్రజలకు ఏం ముఖం చూపిస్తారు? అందుకే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా పారిపోతోంది. కాంగ్రెస్ పార్టీ పారిపోవద్దు. ఓటమిని ఎదుర్కొని ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను చెప్పదలచుకున్నాను’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా ఉండాలనే కాంగ్రెస్ నిర్ణయంపై జేపీ నడ్డా అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో పురాతన పార్టీగా ఉన్న కాంగ్రెస్ చిన్న పిల్లల్లా ప్రవర్తించడం తగదన్నారు. తాను ఆడుకునే బొమ్మను ఎవరో లాగేసుకున్న తీరుగా హస్తం పార్టీ ధోరణి ఉందని, ప్రతిపక్షాల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుంచి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వతను ఆశిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా జరుగుతోందని ఆయన అన్నారు.












































